Sunday, 16 September 2012

Ghrishneshwar

Sri Siva Maha Puranam -- 19 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu

ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగము


ఇళాపురే రమ్యవిశాలకేస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యమ్!
వందే మహోదారతరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే!!

ఈ శివలింగం గురించి చెప్పేటప్పుడు ఒక విశేషణం చెప్పబడింది. ఇంక ఆయన ఔదర్యమును ఇంత అంత అని మీరు లెక్కకట్టి చెప్పడం కుదరదు. స్వామి అంతటి ఔదార్యం ఉన్నవాడు. ఒకానొకప్పుడు దేవగిరి అనే పట్టణంలో సుధర్ముడు అనబడే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతడు త్రికాల సంధ్యావందనం అలవాటయిన వాడు. నిరంతరం శివ పార్థివేశార్చనకు అలవాటు పడిన మనస్సు ఉన్నవాడు.

భగవంతునియందు మనస్సు రమించడం చేత తనకిది ఉన్నదని కాని, తనకిదిలేదని కాని, ఎన్నడు భావన చేయనివాడు. తనకి ఒకటి లేకపోవడం కూడా ఈశ్వరానుగ్రహమే అని అనుకోగలిగినటువంటి సంపన్నత కలిగిన హృదయం ఉన్నవాడు. ఆయన భార్యపేరు సుదేహ. ఆమె మహా సౌశీల్యవతి. భర్తను ధర్మమునందు నిరంతరమూ అనువర్తించే స్వభావం కలిగిన తల్లి. చాలాకాలం ఇలా ఉంటూ ఉండగా వీరిద్దరికీ బిడ్డలు కలగలేదు. ఆమె బాధపడింది. అపుడు ఆయన భార్యతో “ఏమిటే నీ వెర్రి! ఎవరు ఎవరికి తల్లిదండ్రులు? ఎవరు ఎవరికి బిడ్డలు? ఎవరి స్వార్థం వారిది. అటువంటి బిడ్డలకోసం ఎందుకు నీకీ అలజడి? నువ్వు ఈ సంబంధమును ఈశ్వరుని యందు పెట్టు తరిస్తావు.

నీతోపాటు నేను కూడా తరిస్తాను. ఈ బిడ్డలు, సంసారం మనం తరించడానికి ప్రతిబంధకములు. అందుకని మరో ఆలోచన లేకుండా ఈశ్వరుని యందు మనస్సు పెట్టు’ అని చెప్పాడు. ఈ మాటలు విన్న తరువాత ఆవిడ తన మనస్సును సర్దుకుంది. ఈవిడ ఒకసారి పొరుగింటికి వెళ్ళింది. ఆ సందర్భంలో స్త్రీల మధ్య ఎదో వాదులాట వచ్చింది. సుదేహ తనకు తెలిసిన ఒక మంచిమాట చెప్పింది. ఆ పక్కావిడ చెప్పడానికి నీకున్న యోగ్యత ఏమిటి అని అనేసింది. ఈమె మాటలకు సుదేహ చాలా బాధపడింది. భర్త దగ్గరకు వెళ్లి చెప్పింది. అపుడు ఆయన ‘నేను ఎంత చెప్పినా నీవు బిడ్డలను గురించే ఆలోచిస్తున్నావు. మనస్సును ఈశ్వరుని వైపు మరల్చుకోలేక పోతున్నావు. బిడ్డలు కలుగక పోవడానికి దోషము నీదో, నాదో తేల్చడానికి ఒక పరీక్ష పెడతాను.

 ఈ విషయమును ఈశ్వరుదినే అడుగుతాను’ అని చెప్పాడు. తరువాత ఆవిడకి చెప్పకుండా ఒక పరీక్ష పెట్టాడు.
రెండు పూలదండలు తెచ్చి భగవంతుని పాదముల దగ్గర పెట్టాడు. రెండు పువ్వులు పెట్టి ఆయన శివునికి ఒక విజ్ఞాపన చేశాడు. ‘ఒకవేళ నాయందు బిడ్డలు పుట్టడానికి దోషం ఉండి ఉంటే ఆవిడ ఈ దండ ముట్టుకుంటుంది. మాకు అదృష్టం రాసి పెట్టి ఉంటే ఈవిడ ఆ దండ ముట్టుకుంటుంది’ అని ఈశ్వరా నీ సంకల్పమును మాకు చెప్పెయ్యాలి’ అని దండలు అక్కడ పెట్టి భార్యతో ఈ దండలలో ఒకదానిని ముట్టుకో అన్నాడు. ఆయన ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతారని సంకల్పం చేశాడో దానిని విడిచిపెట్టి రెండవదండను తీసింది. అపుడు ఆయన తమ ఇద్దరికీ ఇక సంతానం కలుగదు అని, ఇక సంతానం గురించి తనను ప్రశ్నించవద్దని ఈశ్వరుని యందు మనస్సు పెట్టుకొనవలసిందని చెప్పాడు. అపుడు ఆవిడ అలా వీల్లేదని ‘నాకు కొడుకు పుట్టకపోయినా బాధలేదు. కానే అమ్మా అని పిలిపించుకోవడానికి మీరు మరొక వివాహం చేసుకోండి. ఆమెవలన మీకు సంతానం కలుగుతారు కదా! వాళ్ళు నన్ను అమా అని పిలిస్తే చాలు.

 అని చెప్పింది. అపుడు ఆయన ‘ఈ పని నీవు చెప్పినంత తేలిక కాదు. ఇది ఒకనాడు నీయందు పెనుభూతమై కూర్చుంటుంది. కాబట్టి నేను పెళ్లి చేసుకోను’ అన్నాడు. అపుడు ఆవిడ చచ్చిపోతానుఅన్నంత హఠం చేసింది. ఇక ఆవిడ మాట కాదనలేక ఆవిడ చెల్లెల్నే వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు ఘృష్ణ. సంతోషంగా కాలం గడుస్తోంది. ఘృష్ణకి ఒక లక్షణం ఉండేది. ఏది ఇంట్లో జరిగినా ముందు దానిని అక్కకి చెప్పేది. భర్త కూడా పెద్ద భార్యను గౌరవించి మసలుతున్నాడు. ఆవిడ ప్రతిరోజూ నూట ఒక్క పార్థివ లింగాములకు అర్చన చేసేది. పూజ అయిన తర్వాత నూటొక్క లింగాలను తీసి ఒక సరోవరంలో కలుపుతుండేది. ఇలా మూడు సంవత్సరములు ఆరాధన చేసింది. ఆవిడ చేసిన శివపూజ వలన ఆయనకు నానా అనిపించుకోగల అదృష్టం కలిగింది. మూడు సంవత్సరములలో ఆవిడ దాదాపు లక్ష శివలింగములకు పూజ చేసింది. తదుపరి ఆమె గర్భమును ధరించింది. అనగా అంత పాపం ఇంత అర్చనతో విరిగిపోయింది. ఇప్పుడు ఆవిడ మూడు సంవత్సరముల తర్వాత గర్భం ధరించి పండులాంటి మగపిల్లవాడిని కనింది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటున్నారు. నెమ్మదిగా ఆ పిల్లవాడు పెద్దవాడవుతున్నాడు.

ఆ పిల్లవాడికి యుక్తవయస్సు వచ్చింది. వానికి వివాహం చేశారు. వీళ్ళయితే సుదేహను గౌరవంగా చూశారు కానీ వియ్యాలవారు మాత్రం పిల్లవాని సొంతతల్లి ఎవరయితే ఉన్నదో ఆవిడకు పెద్దపీట వేశారు. దానితో కక్ష సుదేహలో కలిగింది. అసూయ ప్రబలడానికి ఇది హేతువు అయింది. ఒక కొడుకు ఉండడమే తన చెల్లు అంత ఆదరణ పొందడానికి కారణమని తలచి ఆ కొడుకే లేకపోతే ఇంత ఆనందంతో ఉన్న తన చెల్లెలు కళ్ళవెంట నీటిధారలు కారుతుండగా గుండెలు బాదుకుని ఏడిస్తే తప్ప తన అగ్ని చల్లారదని భావించింది.

ఒకరోజు కొడుకు కోడలు శయనించి ఉన్నారు. ఆ సమయంలో తన భార్యతో నిద్రపోతున్న పిల్లవాని గదిలోకి వెళ్లి ఒక కత్తితో ఆ పిల్లవాడిని పొడిచి చంపి శరీరమును ముక్కలుగా కోసి మూట కట్టి ఆ మూటను తీసుకు వెళ్లి తన చెల్లెలు రోజూ శివలింగములను కలిపే చోటులో నీటిలో పారవేసింది. తెల్లవారుజామునే లేచి సంధ్యావందనం చేసుకుని గుళ్ళో ధ్యానం చేసుకుందుకు నదీ తీరమునకు వెళ్ళిపోయాడు. ఈవిడ నూటొక్క లింగములకు అర్చన చేస్తోంది. పిల్ల నిద్రలేచి చూసింది. తన వంటి మీద పక్కబట్టల మీద నెత్తురు ఉంది. ఈ దృశ్యమును చూసి ఆమె గొల్లుమని ఏడుస్తోంది. సుదేహ గబగబా లోపలి వెళ్లి చూసి అయ్యో కొడుకు పోయాడమ్మా అని ఈవిడ కూడా ఏడుస్తూ ఘృష్ణ ఏడవదే అని చూస్తోంది. ఘ్రుష్ణ మామూలుగా శివార్చన చేస్తోంది. ఆవిడ ఎవడు బిడ్డను ఇచ్చాడో వాడు ఆ బిడ్డకు రక్షకుడు. వాడిని ఆయన రక్షిస్తాడు. అని శివలింగాలకు పూజ చేసి తదుపరి ఆ పూజచేసిన శివలింగములను నీటిలో కలపడానికి నది వద్దకు వెళ్ళి చూసేసరికి కొడుకు శరీర భాగములు ఆ నీటి మీద తేలుతూ కనపడ్డాయి. చిత్రం ఏమిటంటే ఆమె ఏమీ అనలేదు. ఈ దృశ్యమును చూసి శివుడు తట్టుకోలేక పోయాడు. అదీ విచిత్రం. ఈ భక్తిని శివుడు భరించలేకపోయాడు. వెంటనే అమ్మా అమ్మా అంటూ పిల్లవాడు వచ్చేసి పెద్దమ్మ చంపగా నీ పూజకు శివుడు మెచ్చి నన్ను బ్రతికించాడు అని చెప్పాడు. ఆవిడ నాయనా, నిన్ను కాపాడిన వాడు మహాకాలుడు. ఆయనే తీసుకెళ్ళ గలడు. ఆయనే బ్రతికించగలడు. ఆయన నిన్ను రక్షించాడు అంది. కానీ తల్లియైన ఘృష్ణ ‘నాయనా నీవు మాట్లాడేది తప్పు. పెద్దమ్మను అలా అనకూడదు. ముక్కంటి స్వామి నిన్ను రక్షించాడు. ఆయన రక్షణ ఉన్నంతకాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు అని ఎవరి మీద కోపము మనసులో లేకుండా ఇంట్లోకి వెళ్ళిపోతోంది. ఇది కూడా శివుడు తట్టుకోలేక మూడు కన్నులతో త్రిశూలం పట్టుకుని ఘృష్ణా, ఈ త్రిశూలంతో నీ అక్కను పొడిచేస్తాను’ అని అన్నాడు. ఆవిడ ఎందుకని అడిగింది. ఈశ్వరుడు తెల్లబోయాడు. ఎందుకేమిటి ఆవిడే నీ కొడుకును చంపేసింది అని చెప్పాడు. కాబట్టే నీవు ఎంత ఉదారుడవో లోకానికి తెలిసింది అంది ఆవిడ. ఎవరు చంపారో లోకానికి తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత! నిన్ను నమ్మిన వారికి నాశనం లేదని లోకమునకు తెలుసు. ఈశ్వరా నీ పాదముల యందు భక్తిని నాకు కృప చెయ్యి. మా అక్కవలన కదా నాకు కొడుకు కలిగాడు. మా అక్క వలన కదా నాకు నీయందు పూనిక కలిగింది. ఈ ఔదార్యమును ఇలా అనుగ్రహించు’ అంది. ఆమె మాటలకు త్రిశూలం పట్టుకున్న అంతటి శివుడు చేష్టలుడిగి నిలబడి సరే నేను నీకు కనపడ్డాను కనుక ఏదేని ఒక కోరిక కోరుకోవలసింది అన్నాడు. ఆమె ‘అయితే ఒకటి అడుగుతాను. ఏ నీటిలో పడిపోయిన పిల్లాడిని రక్షించావో, ఏ నీటిలో రోజూ నూటొక్క లింగములు తీసుకువచ్చి కలిపానో ఆ నీటిలోనే నీవు జ్యోతిర్లింగంగా వెలవవలసినది. నీ దగ్గరకి వచ్చి నమస్కరించిన వాళ్ళందరిని ఇలాగే కాపాడు’ అన్నది. అపుడు శివుడు ‘తప్పకుండా అలాగే చేస్తాను. నీ కోరిక మేరకు ఆ ప్రదేశంలోనే జ్యోతిర్లింగంగా ఉంటాను. నీపేరు మీద ఘృష్ణేశ్వరుడు అనే పేరుతో వెలుస్తాను. నీవు గొప్ప భక్తురాలవు. ఇక్కడకు వచ్చినపుడు అందరూ నిన్ను తలచుకోవాలి. ఒక్కసారి నీ చరిత్ర జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈశ్వరుడి ఔదార్యం ఘృష్ణవలన గుర్తురావాలి. నా ఔదార్యం ప్రకటితం అవడానికి కారణం నువ్వు. కాబట్టి నిన్ను తలచుకుని నన్ను తలచుకోవాలి. నా పేరు ఈశ్వరుడు కాదు ఘృష్ణేశ్వరుడు’ అని ఘృష్ణేశ్వరుడై అక్కడ వెలిశాడు.
పిమ్మట శివుడు ‘ఘృష్ణా, నూటొక్క తరాలు నీవంశంలో చెప్పుకోదగిన మహా భక్తులయిన వారు కుమారులుగా జన్మించి వెడుతుంటారు. అలా నీకు వరం ఇస్తున్నాను. మీ అక్కకు గల దుర్బుద్ధిని తీసివేసి ఆమెకు సద్బుద్ధిని ఇచ్చేశాను. ఆమె ఈవేళ నుంచి నాకు మహా భక్తురాలయిపోతుంది’ అన్నాడు. వీటన్నింటిని ఘృష్ణ అడగలేదు. కానీ ఆమె భక్తితో నమ్మి నిలబడినందుకు ఆమెకు అన్ని వరములను ఇచ్చేశాడు. కాబాట్టే ఈశ్వరుడిని నమ్మిన వారికి ఎన్నడూ లోటు ఉండదు.

No comments:

Post a Comment